వ్యవసాయం, ఇతర రంగాల్లో మరింత అభివృద్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులకు పిలుపునిచ్చారు.
సచివాలయం లోని తన ఛాంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బర భారత్ ఆర్ధిక ప్యాకేజి ద్వారా వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల్లో వ్యవస్థాగత అభివృద్ది కార్యాచరణ పై అధికారులతో మంత్రి కురసాల కన్నబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునే అంశాలపై చర్చించి దిశానిర్ధేశం చేశారు. వ్యవసాయ రంగంలో చేయాల్సిన ముఖ్య ప్రణాళికలు, నిర్దేశిత సమయం, సిబ్బందికి శిక్షణ అనే అంశాలపై సంబంధిత అధికారులలో మంత్రి సమగ్రంగా చర్చించారు.
ఈ క్రమంలో సంబంధిత అధికారుల నుంచి అభిప్రాయలను తెలుసుకున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజి లోని వివిధ అంశాలు మన రాష్ట్రంలో ఇప్పటికే వివిధ పేర్లతో అమలు చేస్తున్నామని వెల్లడించారు. మరికొన్ని వ్యవసాయ అనుబంధ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయం మరియు ఇతర రంగాల్లో మరింత అభివృద్ధి జరిగేలా ఈ ప్యాకేజీనీ సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల వ్యవసాయ,ఉద్యాన శాఖ పంటలపై పక్కాగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
అన్ని విభాగ అధిపతులు, కేంద్రంలోని అధికారులతో మాట్లాడి వారి వారి విభాగ ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రణాళికలు సిద్ధం చేసి అవగాహన చేసుకున్న తర్వాత నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అందిస్తామని తెలిపారు.
సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్లు ప్రద్యుమ్న, అరుణ్‌కుమార్, చిరంజీవి చౌదరి, మత్స్యకార, పశుసంవర్ధక, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.