శ్రీకాకుళంలో నాగావళి నది దాటేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి గల్లంతు కాగా మరో మహిళను నదిలో కొట్టుకుపోతుండగా కాపాడారు స్థానికులు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఈ ఇద్దరూ బహిర్భూమి కోసం నాగావళి నది ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ నుంచి నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి స్వగ్రామాలకు చేరుకుందామని భావించి నదిలో దిగారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ కూడా కొట్టుకుపోయారు.
ఈ ఇద్దరూ నీటిలో తేలియాడుతూ కనిపించడంతో కొంతమంది స్థానికులు వారిని రక్షించడం కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో మహిళను స్థానికులు కాపాడినప్పటికీ ఆతడు మాత్రం గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలంకి చెందిన నాగరాజు, అలాగే పిండ్రువాడకి చెందిన పార్వతీల మద్య గత కొన్నేళ్ళుగా అక్రమ సంబంధం కొనసాగుతుంది.
వారిద్దరి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మూడు రోజుల క్రితం రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా నాగరాజు మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో పాటు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరించడంతో ఆమె ఆందోళనకు గురైంది. బహిర్భూమికి వెళ్దామని చెప్పి నాగరాజు ఆమెను రిమ్స్ వెనుక ఉన్న నాగావళి నది ఒడ్డుకు తీసుకెళ్లాడు.
అక్కడ నుంచి నది దాటి అవతల ఒడ్డుకు చేరుకుని ఇళ్ళకు వెళ్లిపోదామనుకునే సరికి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ క్రమంలో నాగరాజు గల్లంతు కాగా పార్వతిని స్థానికులు కాపాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం వల్లే ఇద్దరికీ ఈ గతి పట్టిందని చెప్పుకుంటున్నారు అక్కడి జనం.