వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ నా ముందు చిన్నపిల్లోడని, ఇలాంటి వారిని చాలామందిని చూసినట్టు చెప్పుకొచ్చారు. అందువల్ల తన వద్ద గీతదాటితే సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సభా కార్యక్రమాలు సజావుగా సాగుకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రేపటికి వాయిదా వేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయాలని చూసే జగన్ వంటి వాళ్లను తాను చాలా మందిని చూశానన్నారు.
ప్రతిపక్ష నేత ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ గీత దాటితే సహించబోనని హెచ్చరించారు. పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానన్నారు. ఆరోజు ఏ ప్రభుత్వమూ స్పందించనంత వేగంగా స్పందించానని తెలిపారు.
జగన్ మంచి సలహాలు ఇస్తే హర్షించి ఉండేవాడినని, కానీ వాస్తవానికి అలా జరగడం లేదని, ఇది రాష్ట్రమంతటికీ దురదృష్టకరమని ఆయన అన్నారు. కంచి పీఠాధిపతి పుష్కర ఘాట్‌లో ఉండబట్టే తాను కూడా అక్కడికే వెళ్లాను తప్ప మరే ఇతర కారణాలూ లేవని స్పష్టం చేశారు. సంతాప తీర్మానాలను కూడా రాజకీయం చేయాలని చూడటం సరైన పరిణామం కాదని చంద్రబాబు హితవు పలికారు.