అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మినీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరో 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జిల్లాలోని నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద జరిగింది.
ఈ గ్రామానికి చెందిన పలువురు మినీ బస్సులో తిరుమలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ మినీ బస్సులో 32 మంది కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు, వారి బంధువులుగా ఉన్నారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో చలపతి (45), బాదమ్మ (40) అనే దంపతులతో పాటు.. వీరి మేనల్లుడు ఈశ్వరయ్య (22)లు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.