ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తక్షణం కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు తప్పుకోవాలంటూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి మాణిక్యాల రావు సూచించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. బహిరంగంగా కోరినా ఆయన పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేరని, అందువల్ల తామే చర్యలు చేపడుతామన్నారు. ఇకపోతే దేవాదాయ భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని... ఆర్టీఐ పరిధిలోకి దేవాదాయ శాఖను తీసుకోస్తామనీ అన్నారు.
దేవాలయాలకు చెందిన ఆస్తులు, అప్పులతో త్వరలో ఓ వెబ్‌సైట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక తిరుమలలో రూ.300 టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది అమల్లోకి రాగానే వీఐపీ లేఖల నిర్మూలన చేస్తామని మంత్రి పేర్కొన్నారు.