వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్పై వైకాపాలోని ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని.. అందుకే వారంతా పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపాలో ఇంకా వలసలు ఆగిపోలేదని.. మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి రానున్నట్లు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందుకోసం తనతో పాటు.. తమ పార్టీకి చెందిన ఇతర నేతలతో వారంతా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికీ వచ్చినవారు 17 మంది అయితే మరో 30 మంది త్వరలో తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చి చేరే వారితో పాటు మొత్తం 47 మంది వైకాపా నుంచి జంప్ అయిన వారవుతారని అచ్చెన్నాయుడు తెలిపారు. తద్వారా ఏపీలోనూ జగన్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు.
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించట్లేదని.. అందువల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.